కలెక్టరేట్ : బకాయి జీతాలు చెల్లించాలని కోరుతూ మున్సిపల్ కార్మికులు మంగళవారం జివిఎంసి ప్రజారోగ్య విభాగంలో భిక్షాటన చేశారు. ఈ సందర్భంగా జివిఎంసి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) గౌరవాధ్యక్షులు పి.వెంకటరెడ్డి మాట్లాడుతూ, సుమారు 600 మంది పారిశుధ్య కార్మికులకు 6 నెలలుగా జీతాలు, కొందరికి 3 నెలలుగా, మరికొందరికి 15 నెలలగా హెల్త్ అలవెన్సు చెల్లించలేదన్నారు. లాక్ డౌన్ కాలంలో ప్రాణాలకు తెగించి పనిచేసిన సందర్భంగా 16 మంది కార్మికులు చనిపోయినా ఇంతవరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్క పైసా కూడా పరిహారం చెల్లించలేదని ఆవేదన వ్యక్తంచేశారు. పిఎఫ్, ఇఎస్ఐ కార్మికుల జీతాల నుంచి కోత కోస్తున్నా ఆ మొత్తాన్ని సంవత్సర కాలంగా చెల్లించకపోవడంతో వైద్యం, రిటైర్మెంట్ బెనిఫిట్స్ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. జివిఎంసికి భారం, కార్మికుల కష్టానికి కారణమవుతున్న అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ (ఆప్కోస్)ను వెంటనే రద్దు చేయాలని, దోపిడీ లేకుండా నడుస్తున్న ఎస్.ఎల్.ఎఫ్‌ను కొనసాగించాలని డిమాండ్ చేశారు.