ఎంవిపి కాలనీ : జిల్లా గ్రంథాలయ అభివృద్ధి సంస్థ చైర్‌పర్సన్‌గా కొండా రమాదేవి మంగళవారం ఉడా చిల్డ్రన్స్ థియేటర్లో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నేటి డిజిటల్ యుగంలో గ్రంథాలయాలను కాలేజీలకు అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి పుస్తకమూ డిజిటల్ రూపంలో దొరుకుతుందన్నారు. చరిత్రలోని చాలా పుస్తకాలను డిజిటలైజేషన్ చేసి ప్రజలకు అందించాలని సూచించారు. కొండా రమాదేవి, రాజీవ్ గాంధీలకు మంచి రాజకీయ భవిష్యత్తు ఉంటుందన్నారు.
మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ, గ్రంథాలయాలకు చైర్మన్లను నియమించి వాటి అభివృద్ధికి ప్రభుత్వం సహకరిస్తుందన్నారు. జీవిఎంసీ పరిధిలోని ఎనిమిది జోన్లలో గ్రంథాలయాల ఏర్పటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని మేయర్‌కు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఎంవివి సత్యనారాయణ, మేయర్ హరి వెంకట కుమారి, ఎమ్మెల్యేలు శీల్పా రవిచంద్రరెడ్డి, అదీప్ రాజ్ పాల్గొన్నారు.
