ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమ బాట పడతామని ఏపీ ఐకాస ఛైర్మన్‌ బండి శ్రీనివాసరావు, ఏపీ ఐకాస అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టంచేశారు. దసరా కానుకగా పీఆర్‌సీ ప్రకటించాలని, అవసరమైతే ఇందుకోసం రాజకీయ నిర్ణయం తీసుకోవాలన్నారు. 12వ తేదీ వచ్చినా పింఛన్లు అందని వారున్నారని, ఒకటో తేదీనే వేతనాలు వచ్చేలా చూడాలని కోరారు. ఏపీ ఐకాస, ఏపీ ఐకాస అమరావతి నేతలు… మంగళవారం తాడేపల్లిలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మను సచివాలయంలో కలిసి సమస్యలపై వినతిపత్రాలు ఇచ్చారు. అనంతరం బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు విలేకర్లతో మాట్లాడారు. ‘ఒకటో తేదీన వేతనాలు చెల్లించలేని ఆర్థికశాఖ తీరును గర్హిస్తున్నాం. పదవీ విరమణ పొందిన వారికి గతేడాది కాలంగా ఆర్థిక ప్రయోజనాలు అందక ఇబ్బంది పడుతున్నారు. కరవుభత్యం బకాయిలు చెల్లించాలి. సమస్యలపై చర్చించేందుకు సీఎంతో సమావేశం ఏర్పాటు చేయాలని కోరాం. సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమించడం తప్ప గత్యంతరం లేదు’ అని స్పష్టం చేశారు. ఉద్యోగుల సమస్యలపై అధికారులతో సీఎం పలు దఫాలు చర్చించారని, ఒకట్రెండు రోజుల్లో సానుకూల నిర్ణయం ప్రకటించేలా చూస్తామని సజ్జల రామకృష్ణారెడ్డి హామీ ఇచ్చినట్లు వివరించారు. ఉద్యోగుల డిమాండ్లను సీఎం దృష్టికి తీసుకెళ్లి వీలైనంత వేగంగా పరిష్కరిస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హామీ ఇచ్చినట్లు చెప్పారు.

By admin

Leave a Reply

Your email address will not be published.