విశాఖపట్నంలోని (Visakhapatnam) శనివాడలో మైనర్ బాలిక పాండ్రంగి పావని అనుమానాస్పద మృతిపై ఇంకా వివాదం కొనసాగుతూనే ఉంది. పావనిది ఆత్మహత్య అని పోలీసులు ఇప్పటికే తేల్చగా.. బాలిక బంధువులు మాత్రం అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పావనిని అత్యాచారం చేసి హత్య చేశారని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి (YCP MP Vijayasai Reddy), మంత్రి అవంతి శ్రీనివాస్ (Minister Avanthi Srinivas) కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం మంత్రి అవంతి శ్రీనివాస్, విజయసాయిరెడ్డి ఘటన జరిగిన అపార్ట్ మెంట్ ను పరిశీలించి, బాలిక తల్లిదండ్రులను పరామర్శించారు. పావని మృతి దురదృష్టకరణని.. తల్లిదండ్రులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామన్నారు. పోలీసులు చెప్పిన దానికి, తల్లిదండ్రులు చెప్పిన దానికి వ్యత్యాసముందని విజయసాయి రెడ్డి అన్నారు. ఈ వ్యవహారంలో పోలీసులు రెండు విషయాలు విచారణ జరపాల్సి ఉందని.. ఆరో అంతస్తునుంచి పడితే కూర్చొని ఉండటం అసాధ్యమన్నారు. దర్యాప్తులో భాగంగా పోలీసు జాగిలాలను ఎందుకు పిలవలేదన్నారు.