ఏవోబీలో మంగళవారం పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మృతి చెందిన ముగ్గురు మావోయిస్టులను గుర్తించినట్లు ఒడిశా డిజిపి అభరు తెలిపారు. బుధవారం మల్కనగిరి జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. తులసి పహాడ్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారని, వారు విధ్వంసం సృష్టించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారని తమకు సమాచారం అందిందని పేర్కొన్నారు. వెంటనే స్పెషల్ ఆపరేషన్ గ్రూపు, డిస్టిక్ వాల్ ఇంటర్ కోర్స్, స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్, బిఎస్ఎఫ్ బలగాలు తులసి పహాడ్ ప్రాంతానికి చేరుకోగా తమ బలగాలపై మావోయిస్టులు కాల్పులు జరిపారని, ప్రతిగా తమ బలగాలు కాల్పులు జరపగా మావోయిస్టులు ముగ్గురు మృతి చెందారని తెలిపారు. మృతి చెందిన మావోయిస్టులు బొమ్మ ఏరియా కార్యదర్శి అనిల్ అలియాస్ కిషోర్ అలియాస్ ముక్కా సోడి, చిన్నారావు, మావోయిస్టు అగ్రనేత ఉదరు రక్షణ బృందంలో ఏరియా కమిటీ సభ్యులుగా ఉన్న సోనీగా గుర్తించామని పేర్కొన్నారు.