హైదరాబాద్‌: ‘ప్రతి మనిషి జీవితంలో ఒక ప్రయాణం ఉంటుంది. రాయికి ఎన్నో దెబ్బలు తగిలితేనే శిల్పం అవుతుంది. అలాగే ప్రతి మనిషి జీవితంలో ఎత్తు పల్లాలుంటాయి. వాటిని అధిగమించి ఒక లక్ష్యాన్ని చేరడమే ‘అన్‌స్టాపబుల్‌’. ఆ కాన్సెప్ట్‌ నాకు నచ్చింది. అందుకే ఈ కార్యక్రమం ఒప్పుకొన్నా’ అని అన్నారు నందమూరి బాలకృష్ణ. ఆయన వ్యాఖ్యాతగా ‘ఆహా’ ఓటీటీలో ప్రసారం కానున్న కార్యక్రమం ‘అన్‌స్టాపబుల్‌’. నవంబరు 4వ తేదీ నుంచి ఈ షో ప్రారంభం కానుంది. గురువారం ఈ కార్యక్రమం కర్టెన్‌ రైజర్‌ జరిగింది.

ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. ”సాంఘికం, జానపదం, సోషియో ఫాంటసీ, కుటుంబ కథాచిత్రాల్లో వివిధ పాత్రలు పోషించి మీకు వినోదాన్ని అందించటానికి ప్రయత్నిస్తున్నా. మీరు అంతులేని ప్రేమాభిమానాలతో నన్ను ఆదరిస్తున్నారు. ఇంకా ఎంతో చేయాలని ప్రేరణ ఇస్తోంది మన తెలుగు జాతి. ‘ఆహా’ ఓటీటీ మాధ్యమం అల్లు అరవింద్‌ మానస పుత్రిక. అంతర్జాతీయ ఓటీటీలకు దీటుగా ‘ఆహా’ను స్థాపించారు. అల్లు రామలింగయ్యగారికి మాత్రమే అమ్మానాన్నల దగ్గర చనువు ఉండేది. ఇండస్ట్రీలో ఆ స్థాయి చనువు మరెవరికీ లేదు. దర్శకుడు ప్రశాంత్‌ వర్మతో సహా ఎంతో మంది ఈ షోకు కష్టపడి పనిచేస్తున్నారు. ఒక మనిషి ప్రజెంటేషన్‌ ఆహాలో వస్తున్న ‘అన్‌స్టాపబుల్’. నటన అంటే ఒక పాత్రలోకి వెళ్లడం. దాని ఆత్మలోకి ప్రవేశించటం. ఎంతో ఒత్తిడితో కూడుకున్నది. తెలుగువారు గర్వించదగ్గ ఓటీటీ ‘ఆహా’. ప్రతి రంగంలోనూ పోటీ ఉంటుంది. అది ఉన్నప్పుడే అసలు మజా ఉంటుంది. మనుషులుగా మనమంతా ఒకటే. బావిలో కప్పలా ఉండకుండా బయటకు వచ్చినప్పుడు అసలు మనిషి ఆవిష్కరించబడతాడు. అలా ఆవిష్కరించే ప్రయత్నమే ‘అన్‌స్టాపపబుల్‌’. మనిషి మనిషికీ జీవితంలో ఒక ప్రయాణం ఉంటుంది. రాయికి ఎన్నో దెబ్బలు తగిలితేనే శిల్పం అవుతుంది. అలాగే ప్రతి మనిషి జీవితంలో ఎత్తు పల్లాలుంటాయి. వాటిని అధిగమించి ఒక లక్ష్యాన్ని చేరడమే ‘అన్‌స్టాపబుల్‌’. ఇది నాకు నచ్చింది. అందుకే ఈ కార్యక్రమం ఒప్పుకొన్నా. ఈ కార్యక్రమానికి వచ్చే నటీనటులతో కలిసి మాట్లాడతా. వాళ్ల భావోద్వేగాలు పంచుకుంటా. మాటలతో వాళ్లను ట్విస్ట్‌ చేస్తా. కలుద్దాం ‘ఆహా’లో అన్‌స్టాపబుల్‌” అని బాలకృష్ణ అన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published.