అమరావతి: నిషేధిత భూముల వ్యవహారాలకు (22ఏ) చెక్ పెట్టాల్సిందేనని ఏపీ సీఎం జగన్ స్పష్టం చేశారు. వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్షపై మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం సమీక్షించారు. నిర్ణీత వ్యవధిలో భూ సర్వే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భూక్రయ విక్రయాలు జరిగినప్పుడు రికార్డులు అప్డేట్ చేయాలని సూచించారు. ”గ్రామ సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ చేపట్టాలి. సర్వే డేటా భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలి.
ఏటా ఒక వారంలో భూ రికార్డుల అప్డేషన్ చేపట్టాలి. భూ రికార్డుల అప్డేషన్, రిజిస్ట్రేషన్ పారదర్శకంగా ఉండాలి. సమర్థవంతమైన మార్గదర్శకాలను తయారు చేయాలి. లోపాలు లేకుండా ఆధీకృత వ్యవస్థలను బలోపేతం చేయాలి” అని సీఎం జగన్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.