శా సనసభకు 2023 చివర్లో జరిగే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రసమితి ఘన విజయం సాధిస్తుందని, 98కి పైగా స్థానాలను కైవసం చేసుకొని అధికారం చేపడుతుందని తెరాస అధినేత, సీఎం కేసీఆర్‌ చెప్పారు. షెడ్యూలు ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని, ముందస్తుకు వెళ్లాలనే ఆలోచన లేదని తెలిపారు. పార్లమెంటు ఎన్నికలతో కలిపి జరిగితే నష్టమనే భావనతో గతంలో ముందస్తుకు వెళ్లామని, ఈసారి అలాంటి అవసరం లేదన్నారు. 70 ఏళ్లలో జరగని అభివృద్ధిని తెరాస ప్రభుత్వం ఏడేళ్లలోనే సాధించి చూపిందని చెప్పారు. వచ్చే 26 నెలలు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని.. పార్టీని, ప్రభుత్వాన్ని పరుగులు పెట్టిస్తామని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో 16 స్థానాల్లో గెలిచి కేంద్రంలోనూ క్రియాశీలకపాత్ర పోషిస్తామన్నారు. ప్రతిపక్షాల దిమ్మతిరిగేలా నవంబరు 15న 10 లక్షల మందితో వరంగల్‌లో విజయగర్జన సభను నిర్వహిస్తామని.. తమపై మొరిగేవారి నోళ్లు మూయిస్తామని స్పష్టం చేశారు. ఆ సభకు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తారని తెలిపారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆదివారం జరిగిన తెరాస శాసనసభ, పార్లమెంటరీ పక్ష సమావేశానికి కేసీఆర్‌ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం ఈ సమావేశంలో ఆయన మాట్లాడిన అంశాలిలా ఉన్నాయి..”తెరాస ఏడేళ్ల పాలన అద్భుతంగా సాగింది. తెలంగాణ సాధనే లక్ష్యంగా ఏర్పాటైన తెరాస.. రాజకీయ పార్టీగా లక్ష్యాలను పూర్తి చేసుకుంది. ఝార్ఖండ్‌ రాష్ట్ర సాధన కోసం ముక్తి మోర్చా పేరిట శిబుసొరేన్‌ ఉద్యమ సంస్థను ప్రారంభించగా.. దానికి ఆదరణ లభించలేదు. దీంతో సొరేన్‌ దానిని పార్టీగా మార్చి రాష్ట్రాన్ని సాధించారు. ఆ అనుభవాన్ని కరీంనగర్‌ సభలో ఆయన నాకు చెప్పడంతో తెరాస పంథాను మార్చాం. రాజకీయ వ్యవస్థతో గాంధేయమార్గంలో, అంబేడ్కర్‌ స్ఫూర్తితో శాంతియతంగా ఉద్యమించి, వ్యూహాత్మకంగా తెలంగాణ సాధించాం.

By admin

Leave a Reply

Your email address will not be published.