కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్, బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ల మధ్య నెలకొన్న ట్విటర్ వార్ గురించి తెలిసిందే. హిందీ జాతీయ భాష కాదని సుదీప్ చేసిన వ్యాఖ్యలు పరిశ్రమలో వివాదస్పదమయ్యాయి. ఈ వివాదంపై ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు స్పందించగా.. తాజాగా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ స్పందించింది. ఈ సందర్భంగా ఆమె హిందీ జాతీయ భాష కాదంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.
ఆమె లేటెస్ట్ మూవీ ‘ధాకడ్’ నుంచి ట్రైలర్ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో కంగనా మీడియాతో మాట్లాడుతూ హిందీ భాష వివాదంపై స్పందించింది. ‘హిందీ కంటే సంస్కృతం పాతది. సంస్కృతం జాతీయ భాషగా ఉండాలి. అయితే, హిందీని జాతీయ భాషగా తిరస్కరించడం పరోక్షంగా కేంద్ర ప్రభుత్వాన్ని, భారత రాజ్యాంగాన్ని అగౌరవపరచడమే’ అని ఆమె అభిప్రాయపడింది. అయితే మొదట మన భాష, మూలాలు, సంస్కృతి గురించి గర్వపడే హక్కు మనందరికీ ఉందని వ్యాఖ్యానించింది.