కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జాతీయ కార్మిక సంఘాల పిలుపు మేరకు ఫిబ్రవరి 23, 24 సార్వత్రిక సమ్మెను, వైజాగ్ స్టీల్‌ప్లాంట్ అమ్మే నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరుతూ ఫిబ్రవరి 23న విశాఖబంద్ను జయప్రదం చేయాలని విశాఖ అఖిలపక్ష కార్మిక, ప్రజా సంఘాల జెఎసి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు శుక్రవారం టిడిపి కార్యాలయంలో జెఎసి కన్వీనర్, టిఎన్టియుసి జిల్లా అధ్యక్షులు వి.రామ్మోహనకుమార్ అధ్యక్షతన జెఎసి సమావేశం జరిగింది. ఈ సమావేశం నిర్ణయాలను జెఎసి చైర్మన్, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఎం.జగ్గునాయుడు మీడియాకు వివరించారు. ఫిబ్రవరి 1 నుండి 7వరకు కోటి సంతకాల కార్యక్రమాన్ని ఉద్యమంలా నిర్వహించనున్నట్లు చెప్పారు. 23, 24 దేశ వ్యాప్త సమ్మెపై ప్రభుత్వ, ప్రయివేటు, అసంఘటిత రంగాల్లో జయప్రదం చేసేందుకు కరపత్రాలు, పోస్టర్లు, డిపార్టుమెంటు మీటింగులు, జనరల్ బాడీలు, గేటు మీటింగులు తదితర రూపాల్లో కార్మికులందరిలోకి సమ్మె క్యాంపెయిన్ తీసుకెళ్తామన్నారు. ఫిబ్రవరి 9వ తేదీన పౌరగ్రంథాలయంలో జిల్లా సదస్సు నిర్వహిస్తామని, ప్రభుత్వ, ప్రయివేటు రంగాలకు సంబంధించిన యూనియన్లు, ఫెడరేషన్లు, నాయకులను భాగస్వాములను చేస్తామని చెప్పారు. ఫిబ్రవరి 8 నుంచి 10 వరకు జోన్లు, రంగాలు వారీగా ప్రాంతీయ సదస్సులు, రౌండ్‌టేబుల్ సమావేశాలు నిర్వహిస్తామన్నారు.