కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న తిరోగమన విధానాలతో దేశం తీవ్రంగా నష్టపోనుందని ఐద్వా నగర అధ్యక్షురాలు బి.పద్మ అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్, ఇతర ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద విశాఖ అఖిల పక్ష కార్మిక, ప్రజా సంఘాల జెఎసి ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలు శుక్రవారం నాటికి 302వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా పద్మ మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం కొత్త పరిశ్రమలు పెట్టి నిరుద్యోగ సమస్య పరిష్కారం చేయడానికి బదులు ఉన్న పరిశ్రమలను ప్రైవేటుకు ధారాదత్తం చేయడం దుర్మార్గమన్నారు. బిజెపి ప్రభుత్వం అభివద్ధి వైపు ఆలోచన చెయ్యకుండా తిరోగ మనం వైపు ఆలోచన చేస్తుందని విమర్శించారు. ప్రభుత్వ రంగ పరిశ్రమలను కాపాడుకోవడానికి ప్రజలందరూ ఈ ఉద్యమంలో భాగస్వాముల కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐద్వా నాయకులు ఆర్.వరలక్ష్మి, కె.కుమారి, ఎస్.రంగమ్మ, ఎ.పుష్ప, కె.లక్ష్మి, శాంతి, రాధాభాయి, నూర్జహాన్ తదితరులు పాల్గొన్నారు.