ఆంధ్రవిశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి ఆచార్య రొక్కం రాధాకృష్ణ (79) స్వల్ప అనారోగ్యంతో విశాఖలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. పిల్లలిద్దరూ అమెరికాలో ఉన్నారు. సోమవారం ఆయన పార్థివ దేహానికి అంత్యక్రియలు జరగనున్నాయి. ఎయు 12వ ఉపకులపతిగా 1998 నుంచి 2001 వరకు సేవలు అందించారు. విద్యావేత్తగా, ఆర్థికవేత్తగా, సామాజిక అధ్యయనవేత్తగా, పరిపాలనాదక్షునిగా పేరుగాంచారు.
ఆచార్య రాధాకృష్ణ శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి దగ్గర కురుడు గ్రామంలో 1942 అక్టోబరు 10న జన్మించారు. ఏయూ నుంచి అర్థశాస్త్రం, సాంఖ్యక శాస్త్రాలలో పీజీ చేశారు. అనంతరం పుణే విశ్వవిద్యాలయం నుంచి పిహెచ్డి పూర్తి చేశారు. ఔరంగాబాద్ మరట్వాడా యూనివర్సిటీలో ఎకనోమ్యాట్రిక్స్ విభాగంలో 1969లో లెక్చరర్‌గా, అనంతరం 1971-80 వరకు అహ్మదాబాద్‌లోని సర్ధార్ పటేల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ సోషల్ రీసెర్చ్‌లో అధ్యాపకునిగా పనిచేశారు. హైదరాబాద్‌లో సెంట్రల్ యూనివర్సిటీ ఆర్థికశాస్త్ర విభాగాధిపతిగా సేవలందించారు. 1985లో సెంటర్ ఫర్ ఎకనామిక్స్, సోషల్ స్టడీస్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఏయూ వీసీగా ఆచార్య ఆర్.రాధాకృష్ణ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. ఏయూ పీజీలో సెమిస్టర్ విధానం, పరీక్షల్లో గ్రేడింగ్, సెల్ఫ్‌ఫైనాన్స్ కోర్సులను ప్రారంభించడం, రీసెర్చ్ ఫోరంను బలోపేతం చేయడం వంటి అంశాలకు పెద్దపీట వేశారు. ఈయన వీసీగా ఉన్న కాలంలో మాజీ రాష్ట్రపతి, మిసైల్ మేన్ డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలాంకు ఏయూ గౌరవ డాక్టరేట్‌ను ప్రధానం చేసింది.
